మునుపటి నా మాట
ఒకనాటి ఉద్యాన (నందన) వనము – నేడు కనుము Click to Zoom వచ్చేసింది కదా- నందన నామ సంవత్సరం! ఇవాళేమిటీ? మార్చి 23. ఉగాది కాబట్టి చైత్ర శుద్ధ (శుక్ల) పాడ్యమి. అంటే చంద్రుడు ‘మీ మనసుల్ని ప్రభావితం చేసేది నేనే కాబట్టి , ఆ సూర్యుడి దయ వల్ల నెలా నెలా వెన్నెల ఇచ్చేది నేనే కాబట్టి నా తిరుగుడు కూడా గమనించి నన్నూ లెక్కలోకి తీస్కోండర్రా’ అని మన పూర్వీకులకి చెప్పడం చేత వాళ్ళు ‘ఆ(, నిన్నెవడు లెక్క చేస్తారోయ్ ‘ అని అనకుండా , కిందా మీదా పడీ లెక్కలు కట్టబట్టీ పన్నెండు ‘చాంద్ర మాసాలు’ ఉన్నాయని తేలింది. అంతే కాదు చంద్రుడి గతి వల్ల అతని రోజు కాస్త ‘తిథి’ అయింది. సూర్యుడికేమో ‘తేది’ దక్కింది. సూర్యుడికి ఎక్కువ రోజులు కేటాయించక పొతే మండి పడడూ? చంద్రుడు మాత్రం పాపం తక్కువ రోజులతోనే చల్లబడ్డాడు. వీరి రోజుల తేడా సంవత్సరానికి దాదాపు పదకొండు. అందుకనీ రెండేళ్లకో, మూడేళ్ళకో ఒకసారి చంద్రుడికి ముప్ఫై ‘అధిక’ తిథులిచ్చి ఆ లోటు పూర్తిచేస్తూ వస్తున్నారు. అలా ఈ ఏడాది మనకో ‘అధిక భాద్రపద’ మాసం వస్తోంది. మార్చి ఇరవై న ‘వసంత విషువత్’ ( సాధారణంగా మార్చి ఇరవై ఒకటిన వస్తుంది. ఈ ఏడాది ‘లీపు’ సంవత్సరం కనుక ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ కనుక , ఈ వసంత విషువత్ మార్చి ఇరవైన వచ్చింది) వచ్చి ‘ వెలుగూ చీకటి సమానత్వం’ అంటూ ఘోషించింది. ఇక ఇప్పటినుంచి సూర్యుడు తన ప్రతాపమంతా మన మీద –అంటే కేవలం మన తెలుగువాళ్ళ మీద అని కాదు, మొత్తం భారతీయులందరి మీదా- చూపిస్తాడన్న మాట. పిల్లలకేమో పరీక్షలైపోయి తల్లులు మెట్టింటి ఎండలు కన్నా పుట్టింటి ఎండలు వెన్నెల్లా ఉంటాయని ప్రయాణాలు కడుతుంటే , తల్లి మమత కొలువునే మరచిన మంత్రిగారు ‘సామాన్యుడి టికెట్ రేట్ పెంచే రాయి’ ని విసిరేశారు సభలో. ‘అది రాయి కాదు, కలికి తురాయి’ అని ఆయన అపోహ పడ్డారు. ‘అయితే కాసుకో అని తల్లి మమతల కోవెల నుంచే మరో ‘రాయి’ విసిరారు. ఆ రాయి కరక్టైన కోణంలో 'ముకుళిత' హస్తం విసిరితే సరిగ్గా రైల్వే ట్రాక్ లో పడింది. ఇక ట్రైన్ టిక్కెట్ రేట్లు పెరగవు, మన నడుములు విరగవు అని తల్లులు ఒయ్యారంగా నడవొచ్చు. ఇదంతా – ఖర నామ సంవత్సరం చివర్లో జరిగినా ‘నందన’ వచ్చిన వేళా విశేషం అని ‘పంచాంగ శ్రవణం’ లో ఈ పాటికి ఘోషించే ఉంటారు.
0 Comments
నిత్య వసంతుడు అక్కినేని వారికి హిందీ అభినందనలు – కొత్త వసంతంలో తక్కిన వారికి తెలుగు శుభాకాంక4/4/2011 ‘అతడక్కినేని ధీనిధి’ – ఈ పలుకులు సరస్వతీ గిరి గారివి. అంటే ఒకప్పటి భారత రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి గారి సతీమణివి. గిరి గారంటే బరంపురం వారనీ మాకో గర్వం. గిరి గారి నమస్కార ముద్ర భలే తమాషాగా ఉండేది. జోత అనేది మొహానికి అడ్డుగా ఉండకుండా చూసుకునేవారు. ఇప్పుడు దాసాహేబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి కొత్తగా జోతలు ఎందుకో అనుకునేవారికి కొంత సమాచారమివ్వాలి. డాక్టర్ అనేది రెండుసార్లు దొర్లింది, ప్రింటింగ్ తప్పు కాదు. నిజమది. ఇటీవల ఆయనకి దక్షిణ భారత హిందీ ప్రచార సభ గౌరవ డాక్టరేట్‌ను చెన్నైలో జరిగిన 74వ వార్షికోత్సవ సభలో ప్రదానం చేసింది. తెలుగు సినిమా వయసు కూడా 75 సంవత్సారాలు దాటింది. అందులో మొదటి పదేళ్లు ఆయనవి కావు కనక అవి తీసేస్తే అప్పటినుంచీ ఇప్పటికీ ఎప్పటికీ యవ్వనుడు అక్కినేని. ఉగాది సందర్భంలో చెప్పాలంటే ‘నిత్య వసంతుడు’. మహాకవి కాళిదాస్ 'మేఘ దూత్' విరచిస్తే అక్కినేని ఆ 'మహాకవి కాళిదాసు' గా నటించి ఆనక 'మేఘ సందేశం' కూడా వినిపించారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఆయనకి 'కాళిదాస్ సమ్మాన్' ప్రకటించింది కూడా. అన్ని ఋతువుల ఋజువు అక్కినేని. అయితే అక్కినేనికి ఆమని తోనే ఎక్కువ అనుబంధముంది. వ్యక్తికే కాని నటనకి శిశిరం లేదని నమ్మే వ్యక్తి ఆయన. భగవంతుని మీద కన్న స్వయం కృషి మీద నమ్మకం పెంచుకున్న శక్తి ఆయన. అందుకే అ -అంటే అక్కినేని అన్నంత ఉన్నతంగా ప్రపంచ చిత్ర సీమ ఆయన్ని గుర్తించింది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|